Visakhapatnam District: విధుల్లో నిర్లక్ష్యం.. డుంబ్రిగూడ ఎస్సైపై సస్పెన్షన్ వేటు!
- ముందస్తు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యం
- అల్లర్లను అదుపుచేయడంలో విఫలం
- వివరాలను వెల్లడించిన ఏపీ డీజీపీ ఠాకూర్
విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన పర్యటనపై ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం స్పందించింది. డుంబ్రిగూడ ఎస్సై అమర్ నాథ్ ను సస్పెండ్ చేసింది. కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ప్రాథమిక విచారణలో తేలడంతో వీరిపై వేటువేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు.
పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ నాయకులు చనిపోయారన్న ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై వారి అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు కొట్టారు.