Maoists: చంద్రబాబు, నేదురుమల్లి మాత్రం బయటపడ్డారు... మావోల మెరుపుదాడుల్లో మరణించిన నేతల వివరాలు!
- మావోల హత్యలతో ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు
- 2003లో చంద్రబాబు, 2007లో నేదురుమల్లిలపై దాడులు విఫలం
- మరణించిన వారిలో దగ్గుబాటి చెంచురామయ్య, మాగుంట, ఎలిమినేటి తదితరులు
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని భావిస్తున్న సమయంలో ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కాల్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మావోయిస్టులు జరిపిన దాడులు, వాటిల్లో మరణించిన, ప్రాణాలు కాపాడుకున్న వారి వివరాలను పరిశీలిస్తే...
2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, 2007లో మాజీ సీఎంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2004లో కేంద్ర మాజీ మంత్రి కే ఎర్రన్నాయుడు మావోయిస్టుల దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
1989లో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై జరిగిన దాడికి ప్రతీకారంగా, నల్లమల దళం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్యను దారుణంగా కాల్చి చంపారు. 1995లో ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డిని ఆయన ఇంటి వద్దే నక్సల్స్ తుపాకులతో కాల్చి చంపారు. ఆ మరుసటి సంవత్సరం అంటే, 1996లో భువనగిరి నుంచి హైదరాబాద్ వస్తున్న నాటి హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్ కేసర్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై మందుపాతర పేల్చి హత్య చేశారు. 1997లో అప్పటి ఎంపీ చింతకాయల అయ్యన్న పాత్రుడిపై దాడి జరుగగా, ఆయన తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో అయ్యన్నపాత్రుడి సోదరుడు చింతకాయల శ్రీను ప్రాణాలు కోల్పోయారు.
1999లో కరీంనగర్ లో మాజీ స్పీకర్ శ్రీపాదరావుపై దాడి చేసిన మావోలు, ఆయన్ను హత్య చేశారు. అదే సంవత్సరం ఆగస్టులో కర్నూలు జిల్లా ఆత్మకూరులో అప్పటి ఎమ్మెల్యే బుడ్డా వెంగళ్ రెడ్డిని, ఆపై రోజుల వ్యవధిలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంను నక్సలైట్లు కాల్చి చంపారు.
ఆ తరువాత 2001లో నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలో ఎమ్మెల్యే రాగ్యానాయక్ ను తుపాకితో కాల్చి చంపిన నక్సలైట్లు, ఆపై నాలుగేళ్ల తరువాత మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సమీపంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని (డీకే అరుణ తండ్రి) హత్య చేశారు.