angelo mathews: ఆసియా కప్ ఎఫెక్ట్.. మాథ్యూస్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన శ్రీలంక బోర్డు!
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన క్రికెటర్
- జట్టు మొత్తం విఫలమైతే తానెలా కారణమవుతానని ప్రశ్న
- కెప్టెన్సీ మార్పుపై వివరణ ఇచ్చిన బోర్డు
యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో శ్రీలంక ఆదిలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏంజెలో మాథ్యూస్ ను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో బోర్డు నిర్ణయంపై మాథ్యూస్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టు మొత్తం చెత్తగా ఆడితే తనను బలిపశువును చేశారని వాపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో జట్టు సమష్టిగా విఫలమైందనీ, దీనికి తానెలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నించారు.
ఆసియా కప్ లీగ్ దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల చేతిలో ఓడిపోయిన శ్రీలంక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాథ్యూస్ ను తొలగించడంతో అతను బోర్డుకు లేఖ రాశాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టు వైఫల్యం కారణంగా కెప్టెన్ ను మార్చలేదని స్పష్టం చేసింది. త్వరలో జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో టీ20, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ బాధ్యతలను దినేశ్ చండీమాల్ కు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.