Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో అదృశ్యమైన 35 మంది రూర్కే ఐఐటీ విద్యార్థులు... సెర్చ్ ఆపరేషన్ మొదలు!
- ట్రెక్కింగ్ కు వెళ్లిన 45 మంది
- మంచు కురుస్తుండటంతో తెలియని ఆచూకీ
- మంచు కారణంగా ఐదుగురు మరణించారన్న అధికారులు
హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంలో 35 మంది రూర్కే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అదృశ్యంకాగా, విషయం తెలుసుకున్న అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం 45 మంది ట్రెక్కింగ్ కోసం లాహౌల్, స్పితి జిల్లాలకు వెళ్లగా, ఈ ప్రాంతాన్ని మంచు వర్షం కమ్మేసిన వేళ ఈ ఘటన జరిగినట్టు ఓ విద్యార్థి తండ్రి రాజ్ వీర్ సింగ్ తెలిపారు.
హంప్తా పాస్ ను అధిగమించి, ఆపై మనాలీకి రావాలని విద్యార్థులు భావించారని, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తెలియక ఆందోళన పడుతున్నామని ఆయన అన్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ పరిధిలో మంచు దట్టంగా కురుస్తూ ఉండటంతో ఇప్పటివరకూ ఐదుగురు మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కులు, కంగ్రా, చంబా జిల్లాల్లో సోమవారం నుంచి మంచు భారీగా కురుస్తోందని తెలిపారు. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించామని, వరద ముప్పు పొంచివున్న ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయిస్తున్నామని అన్నారు.