Supreme Court: మావల్ల తేలదు... పార్లమెంటే తేల్చాలి!: కేసులున్న వారు ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సుప్రీంకోర్టు కీలక రూలింగ్!
- కొద్దిసేపటి క్రితం వెల్లడైన తీర్పు
- పార్లమెంటులో చట్టాలతోనే నేరచరితులకు అడ్డుకట్ట
- నేతల అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమే
- చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా
వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, కొద్దిసేపటి క్రితం కీలక కేసులో తీర్పును వెలువరించారు. నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో తాము ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని, అభ్యర్థుల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
నేతల అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, ఈ విషయంలో పార్లమెంటులో కఠిన చట్టాలను తేవాల్సివుందని పేర్కొంది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా పెట్టవచ్చని తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ తమపై ఉన్న పెండింగ్ కేసులను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.