chandrababu: చంద్రబాబు, లోకేష్ ఆస్తులపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించండి: హైకోర్టులో పిటిషన్
- నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారు
- క్విడ్ ప్రోకో ద్వారా ప్రయోజనాలను పొందేందుకు వేమూరి రవికుమార్ ను ఉపయోగించుకుంటున్నారు
- 57,836 ఎకరాల భూమి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి
గత నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మాజీ న్యాయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జె.శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఏపీలో ఐటీ అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు వేలాది ఎకరాలను ధారాదత్తం చేసిన చంద్రబాబు, లోకేష్ లు రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ లను చేర్చారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత తన సమీప బంధువు రవికుమార్ ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుడిగా, ఏపీఎన్నార్టీ ఛైర్మన్ గా నియమించారని పిటిషన్ లో ఆరోపించారు.
కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో ద్వారా ప్రయోజనాలను పొందేందుకు రవికుమార్ ను చంద్రబాబు, లోకేష్ లు ఉపయోగించుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. వివిధ కంపెనీలకు కేటాయించిన 57,836 ఎకరాల భూముల్లో జరిగిన కొన్ని అక్రమాలను పిటిషన్ లో పేర్కొన్నారు. ఇన్నోవా సొల్యూషన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు విశాఖలో సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకే కేటాయించారని ఆరోపించారు. 57,836 ఎకరాల భూమిని ఏయే కంపెనీకి ఎక్కడ, ఎంత స్థలం కేటాయించారనే విషయాలను ఏపీఐఐసీ పేర్కొనలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని తెలిపారు.