america: అమెరికా చర్యలతో చర్చలకు విఘాతం: చైనా మంత్రి
- చైనా వస్తువులపై మరోసారి సుంకం విధించిన అమెరికా
- చైనాను చర్చలకు ఆహ్వానించిన ముచిన్
- వాణిజ్య యుద్ధం విషయంలో అమెరికాదే తప్పు
అమెరికా తీసుకుంటున్న చర్యలు ఇరు దేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని చైనా మంత్రి వాంగ్ చౌవెన్ పేర్కొన్నారు. అమెరికా మరో 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఓవైపు అమెరికా ఆర్థిక శాఖా మంత్రి స్టీవెన్ ముచిన్... చైనా అధికారులను చర్చల కోసం ఆహ్వానిస్తే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మళ్లీ పెద్ద మొత్తంలో చైనా వస్తువులపై సుంకాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వాంగ్ చౌవెన్ మండిపడ్డారు. వాణిజ్య యుద్ధం విషయంపై అమెరికాదే తప్పు అని ఆరోపించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. కానీ ఇరు దేశాలూ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. అమెరికా వాణిజ్య నిబంధనల విధానాన్ని అవలంబిస్తూ.. ఇతరులను సుంకాల పేరుతో వేధిస్తోందని వాంగ్ చౌవెన్ విమర్శించారు.