Basara IIIT: అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటీ.. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఆందోళన
- సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా విద్యార్థుల ధర్నా
- మెస్లను మూసివేసి సెలవులు ప్రకటించిన అధికారులు
- సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం చేపట్టిన ఆందోళన సోమవారం రెండో రోజూ కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో అధికారులు సోమవారం రాత్రి నిరవధిక సెలవులు ప్రకటించారు. మెస్లను మూసివేశారు. అయినప్పటికీ విద్యార్థులు అక్కడి నుంచి కదలకుండా మంగళవారం కూడా అక్కడే బైఠాయించి సమస్యలపై గళమెత్తారు. గవర్నర్, కేటీఆర్ వస్తే కానీ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. విద్యార్థుల డిమాండ్లకు ఇన్చార్జి వీసీ అశోక్ అంగీకరించినా వారు ఆందోళన విరమించేందుకు అంగీకరించలేదు.
మంగళవారం ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మెస్లను మూసివేసినప్పటికీ విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఎండలో కూర్చుని ఆందోళన కొనసాగించారు. దీంతో ఎండ, మరోవైపు తిండిలేకపోవడంతో కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. అయినప్పటికీ అధికారులు మెస్లను తెరవలేదు. మంగళవారం రాత్రి మాత్రం కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యార్థులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వీసీతో మాట్లాడారు. తన వద్దకు విద్యార్థుల బృందాన్ని పంపితే మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, సెలవులు ఎప్పటి వరకు అన్నది త్వరలోనే ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు.