Amravathi: రూ.883 కోట్లతో అమరావతికి రైల్వే లైను.. త్వరలోనే అనుమతులు: దక్షిణ మధ్య రైల్వే
- పార్లమెంటు సభ్యులతో సమావేశమైన రైల్వే జీఎం
- అమరావతికి తొలుత సింగిల్ లైన్
- పూర్తవుతున్న విజయవాడ-విశాఖ మూడో లైన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైను కల నెరవేరబోతోంది. రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి రైల్వే బోర్డుకు నివేదిక పంపినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు లైన్లకు సరిపడా భూసేకరణ జరుగుతుందని, తొలుత సింగిల్ లైన్ నిర్మిస్తామని, అనంతరం డిమాండ్‌ను బట్టి రెండో లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వచ్చే రెండేళ్లలో దక్షిణమధ్య రైల్వే జోన్ మొత్తం విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. అలాగే, తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మార్చి 2019 నాటికి విజయవాడ, గుంటూరు, గుంతకల్ కర్నూలు రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. విజయవాడ-విశాఖ మూడో లైన్, నడికుడి-శ్రీకాళహస్తి మార్గం పనులు వేగంగా జరుగుతున్నట్టు జీఎం వివరించారు.