Araku: 'కోట్లు తీసుకుని పార్టీ మారావు.. ఆ డబ్బు చాలలేదా?'... కాల్చేముందు కిడారికి మావోల ప్రశ్న!
- బాక్సైట్ కోసమే రోడ్లు వేస్తున్నారు
- నీకు చాలా అవకాశాలు ఇచ్చాం
- ఇక సహించేది లేదంటూ కిడారిని కాల్చిన మావోలు!
"కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారావు. ఆ డబ్బు చాలలేదా? బాక్సైట్ కోసమే రోడ్లు వేస్తున్నారు. బాక్సైట్ కోసం భూములు తవ్వితే గిరిజనుల జీవితాలు బుగ్గిపాలవుతాయి. ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాం. ఇక చాలు"... తాము కిడ్నాప్ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, ప్రజాకోర్టును నిర్వహించిన మావోయిస్టులు ఆయన్ను కాల్చివేసే ముందు చెప్పిన మాటలివి.
ఈ ఘటనను చాలా మంది సామాన్య గిరిజనులు ప్రత్యక్షంగా చూశారు. వారు ఈ వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. గూడలో క్వారీ విషయాన్ని ప్రస్తావించిన మావోయిస్టులు, క్వారీ కారణంగా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో నష్టం జరుగుతోందని, దీన్ని సహించేది లేదని గతంలోనే హెచ్చరించామని కిడారికి మావోలు గుర్తు చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. పోలీసు నిఘా వర్గాలతో మాట్లాడి ఈ రిపోర్టును తయారు చేసిన ఆయన, అరకులోయలో గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరిన తరువాత హత్య వరకూ ఏం జరిగింది? దాడుల్లో పాల్గొన్నది ఎంతమంది? తదితర వివరాలను తన రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.