West Bengal: దుర్గమ్మ పూజకు మట్టి ఇవ్వం.. తేల్చిచెప్పిన కోల్ కతా సోనాగాచీ వేశ్యావాటిక!
- సోనాగాచిలో మట్టిని తీసుకెళ్లి దుర్గ పూజ
- మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం
- వ్యతిరేకిస్తున్న సోనాగాచీ వాసులు
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో సోనాగాచీ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాగా పేరుగాంచింది. తాజాగా సోనాగాచీ వాసులు దుర్గామాత పూజకు తమ ప్రాంతంలోని మట్టిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇప్పుడే కాకుండా గత మూడేళ్లుగా అక్కడి ప్రజలు స్థానికంగా మట్టిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సాధారణంగా వేశ్యావాటికల నుంచి మట్టిని తీసుకొచ్చి దుర్గామాత పూజకు వినియోగిస్తారు.
దీనివల్ల శుభం కలుగుతుందని స్థానిక ప్రజలు నమ్ముతారు. అయితే దీన్ని వివక్ష చూపడంగా పరిగణిస్తున్న అక్కడి ప్రజలు మట్టిని ఇవ్వడాన్ని నిరాకరిస్తున్నారు. ఈ విషయమై సెక్స్ వర్కర్స్ అసోసియేషన్ దర్బార్ సమోనాయ్ కమిటీ సభ్యురాలు శుశ్రీ భారతీ డే మాట్లాడుతూ.. మిగతా ప్రజల్లా కాకుండా సెక్స్ వర్కర్లను వేరుగా చూడటాన్ని వ్యతిరేకిస్తూ మట్టి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెక్స్ వర్కర్లు కూడా సామాన్య మనుషులేననీ, వారిపట్ల వివక్ష చూపడం మానుకోవాలని సూచించారు.