KVP: కేవీపీ డాక్యుమెంటరీ ‘జగన్నినాదం’లా ఉంది: జేడీ శీలం ఫైర్
- కాంగ్రెస్ సదస్సులో ప్రత్యేక హోదాపై ప్రదర్శన
- ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు నాయకులు
- ముఖ్యమంత్రిని మాత్రమే ఎత్తిచూపడంపై ఆగ్రహం
‘ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు రూపొందించిన డాక్యుమెంటరీపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ‘ఏమిటీ డాక్యుమెంటరీ... హోదా విషయంలో జగన్‌ను వదిలేసి ముఖ్యమంత్రిని మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటి? అంతా సొంత డబ్బాలా ఉంది, దీనివల్ల కాంగ్రెస్‌కు ఏమైనా ప్రయోజనం ఉందా?’ అంటూ కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్‌చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జేడీ శీలం తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సదస్సులో కేవీపీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దీన్ని చూసిన శీలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఈ డాక్యుమెంటరీ జగన్‌ని ప్రశ్నించేలా లేదు, చంద్రబాబును టార్గెట్ చేసినట్లు ఉంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘మనకు చంద్రబాబు ఎంత శత్రువో, జగన్ కూడా అంతే శత్రువు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీలోనే ఉంది. వలసలు రావాలంటే ఆ పార్టీ నుంచే రావాలి. అలాంటప్పుడు ఇదేం తీరు? అంటూ శీలం అనగా ఆయన మాటలను పలువురు సమర్థించారు. దీనిపై కేవీపీ స్పందిస్తూ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని, తానింత దూరం ఆలోచించలేదని అన్నారు.