maoist: నల్లమల అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు
- అరకు ఘటనతో అలర్ట్ అయిన కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం
- మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు
- త్వరలోనే నల్లమలలో పూర్తి స్థాయి కూంబింగ్
అరకులో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేయడంతో కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. నల్లమల అడవుల పరిసర ప్రాంతాలను వారు జల్లెడ పడుతున్నారు. ఒకప్పటి మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, అటవీ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం కొత్తపల్లి మండలం బలపాలతిప్ప, జానాలగూడెం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం గ్రామాలతో పాటు కృష్ణా తీరం వెంట తనిఖీలు చేపట్టారు. కల్వర్టులు, వంతెనలు ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నల్లమలలో తనిఖీలను, కూంబింగ్ లను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. మావోయిస్టులకు నల్లమల షెల్టర్ జోన్ గా ఉంది. కొన్ని దశాబ్దాల పాటు మావోల కదలికలు, పోలీసుల కూంబింగ్ తో ఈ ప్రాంతం వణికిపోయింది. లోకల్ గెరిల్లా, ప్రజా గెరిల్లా, మహానంది, భవనాశి దళాలు ఈ ప్రాంతంలో అప్పట్లో పని చేశాయి.