Maoists: పక్కా ప్లాన్.. కిడారి హత్యకు మూడురోజుల ముందే లివిటిపుట్టుకు భారీగా మావోయిస్టులు
- కండ్రూం పంచాయతీ సమీప అడవుల్లో మాటు
- ఆపరేషన్లో కొందరు...వారికి భద్రతగా మరికొందరు
- ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ దుస్తులతో సంచారం
కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్య పథకాన్ని అమలు చేసేందుకు లివిటిపుట్టుకు భారీగా మావోయిస్టులు తరలివచ్చారని తెలుస్తోంది. భారీ టార్గెట్...పైగా ప్రమాదకరమైన ఆపరేషన్...ఏ మాత్రం తేడా వచ్చినా భారీ నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు. క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపి ఏవోబీలో తమ ఉనికికి ఢోకాలేదని నిరూపించాలన్న ఆలోచనతో చేపడుతున్న ఆపరేషన్ కావడంతో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య విషయంలో మావోయిస్టులు పకడ్బందీగా వ్యవహరించారనిపిస్తోంది.
ప్రజాప్రతినిధులే లక్ష్యం కావడంతో పక్కా ప్రణాళిక, ఎక్కడా ఎటువంటి లోపానికి తావివ్వకుండా ఆపరేషన్ పూర్తిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని, ఇందుకోసమే భారీ సంఖ్యలో మోహరించారని అర్థమవుతోంది. ఏజెన్సీలో కీలకమైన పెదబయలు దళంతోపాటు ఒడిశా కటాఫ్ ప్రాంతంలోని ఏరియా కమిటీ, కోరాపుట్ జిల్లా నందపూర్ దళానికి చెందిన మావోయిస్టులంతా కాలినడకనే మూడు రోజుల ముందు కండ్రూం పంచాయతీ పరిధిలోని అడవులకు చేరుకున్నారు.
సాధారణ దుస్తుల్లోనే సంచరించారు. డుంబ్రిగుడ మండంలోని గుంటసీమ ప్రాంతం తర్వాత గ్రామాలన్నీ ఒడిశాలోనే ఉన్నాయి. ఒడిశా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో సులభంగా తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతోనే తమ లక్ష్యానికి ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకున్నారని భావిస్తున్నారు. పైగా జవాన్ పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజన అభ్యర్థుల కోసం పోలీసు శాఖ ఆదివారం అరకులోయలో మెరిట్ టెస్ట్ ఏర్పాటు చేసింది. ఆ హడావుడిలో పోలీసులు ఉండి తమ కదలికపై దృష్టిపెట్టరని అంచనాకు వచ్చారు.
లివిటిపుట్టు పరిసరాల్లో మోహరించి సెల్ఫోన్ ఆధారంగా కిడారి, సివేరి కదలికపై నిఘా ఉంచారు. అనుకున్న విధంగానే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తమ ఉచ్చులోకి చేరుకోగానే పనిపూర్తిచేసి వెళ్లిపోయారు. వచ్చిన వారిలో కొందరు ఆపరేషన్లో నేరుగా పాల్గొనగా మరికొందరు చుట్టుపక్కల మోహరించి ఆపరేషన్లో పాల్గొన్న వారికి రక్షణ కవచంగా నిలిచినట్లు సమాచారం. ఆపరేషన్ పూర్తయ్యాక అటవీ మార్గంలో వెళ్లిపోయారు. ఘటన సమాచారం అందినప్పటికీ పోలీసులెవ్వరూ వెంటనే అక్కడికి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఇది కూడా మావోయిస్టులు సులభంగా తప్పించుకునేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు.