Vizag: మాకేమీ తెలియలేదు, మేమేమీ చూడలేదు: మావోల హత్యలపై లివిటిపుట్టులో ఎవరిని అడిగినా ఇదే సమాధానం!
- లివిటిపుట్టు సమీపంలోనే కిడారి హత్య
- ఆదివారం కావడంతో చర్చ్ కి వెళ్లాం
- పోలీసులు ప్రశ్నలతో వేధిస్తున్నారని ఆరోపణ
లివిటిపుట్టు... విశాఖపట్నం జిల్లా, అరకు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలో అడవుల మధ్య ఉన్న ఓ చిన్న కుగ్రామం. ఈ గ్రామానికి సమీపంలోనే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామం మొత్తం షాక్ లో మునిగిపోయింది. ఈ హత్య కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తుండగా, అందరి నుంచీ ఒకే సమాధానం వస్తోంది.
"మాకేమీ తెలియదు. మేమేమీ చూడలేదు. ఆదివారం కావడంతో చర్చ్ కి వెళ్లిపోయాం" అని వారు అంటున్నారు. గ్రామంలో ఒక్కరూ లేకుండా పోవడం ఏంటని, కాల్పుల శబ్దం ఎవరూ వినకపోవడం, 150 మంది నివాసం ఉండే గ్రామానికి 60 మంది వరకూ మావోలు వచ్చి మకాం వేస్తే, ఎవరికీ తెలియకపోవడం ఏంటన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, తమది చాలా ప్రశాంతమైన గ్రామమని, ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదని చెబుతున్న లివిటిపుట్టు గ్రామస్తులు, తమను వేధించడం మానుకోవాలని వేడుకుంటున్నారు.