sc st: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ వద్దు.. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!
- నాగరాజు కేసులో తీర్పును సమర్ధించిన ధర్మాసనం
- కొత్తగా రిజర్వేషన్ అమలు అవసరం లేదని వ్యాఖ్య
- పాత తీర్పును సమీక్షించబోమని వెల్లడి
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పును వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు అసవరం లేదని తీర్పు ఇచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేందుకు రిజర్వేషన్లు కల్పించడంపై 2006లో నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించేందుకు కొన్ని షరతులు విధిస్తూ.. నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై 2006లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కొన్నిరోజుల క్రితం సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. నాగరాజు కేసులో ఎలాంటి సమీక్షలు చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.