Telugudesam: ఎమ్మెల్యే కిడారి హత్య కేసు.. 20 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు తరలింపు
- ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
- గిరిజనుల సాయంతోనే దాడి జరిగిందని పోలీసుల అనుమానం
టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్యచేసిన నేపథ్యంలో విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓవైపు మావోలను ఏరివేసేందుకు భద్రతాబలగాలు భారీ సంఖ్యలో ఆపరేషన్ చేపడుతూ ఉండటంతో హత్యలు జరిగిన లివిటిపుట్టుకు చెందిన గ్రామస్తులు భయంభయంగా బతుకుతున్నారు.
మరోవైపు ఈ రోజు ఉదయం లివిటిపుట్టు గ్రామానికి చెందిన 20 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున గిరిజనుల ఇళ్లకు చేరుకున్న అధికారులు వీరిందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కేవలం 150 మంది ఉండే ఊరిలో 60 మందికిపైగా మావోయిస్టులు వచ్చినా తెలియకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనుల సాయంతో పక్కా ప్రణాళికతోనే తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలపై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది పురుషులను అధికారులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను పోలీసులు తీసుకెళ్లడంతో గిరిజన మహిళలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.