apcc: ఆ రెండు పార్టీలకు రాఫెల్ కుంభకోణం కనిపించడం లేదా?: కాంగ్రెస్ నేత శివాజీ కొలనుకొండ
- వైసీపీ, జనసేన నిమ్మకు నీరెత్తిన్నట్లుగా ఉన్నాయి
- ఎన్డీఏ సర్కారు తీరుపై నోరు మెదపరే?
- ఈ పార్టీలు నయవంచక బీజేపీతో కుమ్మక్కయ్యాయి
రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై మోదీ సర్కారును దేశంలోని అన్ని పార్టీలు నిలదీస్తుంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, జనసేన పార్టీలు నిమ్మకు నీరెత్తిన్నట్లుగా వ్యవహరించడం బాధాకరమని ఏపీసీసీ అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు శివాజీ కొలనుకొండ విమర్శించారు.
‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సదరు పార్టీల నాయకులు, దేశాన్ని భ్రష్టు పటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీపై, ఎన్డీఏ సర్కారు తీరుపై ఎందుకు నోరు మెదపడం లేదు? రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దేశాన్ని నివ్వెరపరిచే రీతిలో మోదీ సర్కారు సుమారు రూ.50 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి వీరికి కనిపించడం లేదా? ఈ రెండు పార్టీలు నయవంచక బీజేపీతో కుమ్మక్కయ్యాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు.
నాలుగున్నరేళ్ల పాలనలో 90 సార్లు విదేశీ పర్యటనలు చేయడం మినహా మోదీ దేశానికి చేసిందేమీ లేదని, ప్రజాధనాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా ఆర్థిక విధానాలు, కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోపక్క పెట్రోలు, డీజిల్ ధరలు అంతు లేకుండా పెరుగుతుంటే కేంద్రం ఒక్క రూపాయి కూడా సుంకాలు ఎత్తివేయలేదని, మరోపక్క డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోందని, నిత్యావసరధరలు విపరీతంగా పెరిగిపోయి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఉద్యోగావకాశాలు లేక యువత దిక్కుతోచని స్థితిలో ఉందని, లోపభూయిష్ట ఆర్థిక విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని, అన్నిటికీ మించి నరేంద్రమోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టం అమలు చేయకుండా తీవ్రంగా అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా కళ్లుండి చూడలేని కబోదుల్లాగా ఏపీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మంత్రి పదవులు అనుభవించిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ముఖం చాటేశారని,. అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి ప్రత్యేక హోదాపై పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు.
దేశం, రాష్ట్రం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, ప్రత్యేకించి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంపై రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టారని, కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఈ అంశంపై తీర్మానం చేయడమే కాకుండా, ఇటీవల కర్నూలు సభలో సైతం ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రంలో అడుగుపెట్టబోనని కూడా ప్రతినబూనిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నరేంద్ర మోదీ సర్కారుకు, వారికి కొమ్ముకాస్తున్న వారిని ఐదు కోట్లమంది ఆంధ్రులు క్షమించరని శివాజీ అన్నారు.