Uttar Pradesh: విద్యార్థులకు ఒక్క రోజు కలెక్టర్‌గా ఉండే అవకాశాన్ని కల్పిస్తున్న యూపీ కలెక్టర్!
- షాజహాన్‌పూర్ కలెక్టర్ వినూత్న ఆఫర్
- స్వచ్ఛ భారత్‌లో చురుగ్గా పనిచేస్తే చాలు
- ఇందుకోసం విద్యార్థులకు టాస్క్‌లు
ఒక్క రోజు సీఎం.. ఓ సినిమాలో జర్నలిస్టుకు వచ్చిన అవకాశం. అయితే, సీఎం కాదు కానీ.. ఒక్క రోజు కలెక్టర్‌గా ఉండే అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) అమృత్ త్రిపాఠి. ఒక్క రోజు కలెక్టర్ కావాలనుకునేవారు స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తూ తనను తాను మంచి కార్యకర్తగా నిరూపించుకోవాలంతే. ప్రజల్లో పరిశుభ్రతా చర్యలు పెంచేలా విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగానే త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కోసం పని చేసేందుకు స్థానిక కళాశాలల విద్యార్థులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రచార బాధ్యతలను కలెక్టర్ వారికి అప్పగించారు. ఇందుకోసం వారికి కొన్ని టాస్క్‌లు కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఆయా గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, గ్రామాల్లో నిధులు సమర్థంగా ఎలా వినియోగించాలో సలహాలు, సూచనలతో కూడిన నివేదిక కూడా ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థుల పనితీరును పరిశీలించి అత్యుత్తమంగా పనిచేసిన వారిని ఎంపిక చేసి షాజహాన్‌పూర్‌కు ఒక రోజు కలెక్టర్‌గా ఉండే బాధ్యతలు అప్పగించనున్నట్టు త్రిపాఠి తెలిపారు. ఆ రోజంతా ఆ విద్యార్థి వెంట ఉండి తాను సలహాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఆర్థిక అంశాల విషయంలో మాత్రం అధికారాలు ఉండవని కలెక్టర్ చెప్పారు.