Revanth Reddy: ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి బ్యాంక్ ఖాతాలపై నిఘా!
- డబ్బు ఎక్కడిదో తేల్చలేకపోయిన ఏసీబీ
- ఏసీబీ కోరిన మీదట కేసు నమోదు చేసిన ఈడీ
- రేవంత్, ఆయన సోదరుడి ఖాతాల్లోకి విదేశీ నిధులు!
ఓటుకు నోటు కేసులో స్టీవెన్ సన్ ముందు రేవంత్ రెడ్డి ఉంచిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని ఆధారాలతో సహా కనిపెట్టలేకపోయిన తెలంగాణ ఏసీబీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయగా, వారు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి చెందిన బ్యాంకు ఖాతాలపై గత ఆరు నెలలుగా నిఘా పెట్టి, నేడు సోదాలకు దిగినట్టు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా, వారి బ్యాంకు ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరుగుతూ ఉండటం, విదేశాల నుంచి లక్షలు వచ్చి పడుతుండటంపై ఆధారాలు సంపాదించిన ఈడీ విభాగం, ఆ డబ్బుపై వివరాలు తెలుసుకునేందుకు దాడులు చేస్తున్నట్టు అనధికార వర్గాల భోగట్టా.
రూ. 50 లక్షలు ఎక్కడివన్న విషయాన్ని తాము తేల్చలేకపోతున్నామని తెలంగాణ ఏసీబీ స్పష్టం చేయగా, వారి తరఫున రాష్ట్ర డీజీపీ, ఈడీ సహకారాన్ని కోరుతూ కేంద్ర హోమ్ శాఖకు గతంలో లేఖ రాశారని, దానిపై హోమ్ శాఖ ఆదేశాల మేరకు ఈడీ కేసు పెట్టిందని తెలుస్తోంది. రెండు వారాల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన ఓ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కూడా విదేశాల నుంచి భారీగా నిధులు రావడంతో, ఐటీ నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులోనూ రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ నోటీసులకు రేవంత్ గానీ, ఆయన సోదరుడుగానీ సమాధానం ఇవ్వకపోవడంతో ఐటీ శాఖ కూడా నేటి దాడుల్లో భాగమైంది.