Chinthamaneni Prabhakar: పవన్ కల్యాణ్ చేసిన మూడు ఆరోపణలకు జవాబిచ్చిన చింతమనేని ప్రభాకర్!
- నా హత్యకు కుట్రపన్నిన వారితో పవన్ చేతులు కలిపారు
- అరాచకంగా మారిన కానిస్టేబుల్ ను అడ్డుకున్నా
- జనసేనాని ప్రశ్నలకు జవాబిచ్చిన ఏపీ ప్రభుత్వ విప్
రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ స్థాయికి దిగజారిపోయాడని దెందులూరు ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. తనను హత్య చేయాలనుకుంటున్న వారితో పవన్ చేతులు కలిపి తనపై విమర్శలు చేశాడన్నారు. తనపై దెందులూరు బహిరంగ సభలో పవన్ చేసిన మూడు విమర్శలకు ఆయన జవాబిచ్చారు. ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన చింతమనేని.. పవన్ విమర్శలపై అంశాల వారీగా జవాబిచ్చారు.
దెందులూరులో కానిస్టేబుల్ పై దాడి..
దెందులూరులో ఉంటున్న ఆ కానిస్టేబుల్ వీధిలో రెండు కుక్కలను పెంచుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడని ప్రభాకర్ తెలిపారు. ఆ దారిన వెళ్లేవారిపై ఆ జంతువులను ఉసిగొల్పుతున్నాడని పేర్కొన్నారు. అతను ఇప్పటికే చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడనీ, ఆవులు, గేదెలను సంతకు తోలుకెళ్లేవారి వద్ద భారీగా డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. అలాంటి వ్యక్తిని తాను అడ్డుకున్నానని స్పష్టం చేశారు.
దివ్యాంగుడిపై చేయిచేసుకోవడం..
ఇక తాను ఓ దివ్యాంగుడిపై చేయి చేసుకున్నట్లు పవన్ చేసిన విమర్శలపై చింతమనేని సీరియస్ అయ్యారు. పవన్ చెప్పిన సదరు వ్యక్తి రూ.5, రూ.10 వడ్డీకి తిప్పుతూ సామాన్యులను అష్టకష్టాలకు గురి చేశాడని విమర్శించారు. అతను సామాన్యుల ఇళ్లు, భూములను భారీగా లాక్కున్నాడనీ, అసలుతో పాటు వడ్డీ ఇచ్చేసినా ఇంకా ఇవ్వాలంటూ వేధించుకుని తినేవాడన్నారు. ఇలా ప్రవర్తించడం సరికాదని మాత్రమే అతనికి తాను చెప్పానన్నారు.
జాన్ అనే కార్మిక నాయకుడిని కొట్టడం..
తాను జాన్ అనే కార్మిక నాయకుడిని కొట్టినట్లు పవన్ ఆరోపించడంపై చింతమనేని స్పందిస్తూ.. తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తిని లిక్కర్ డిపోలో జాన్ అధికారం లేకున్నా పలుకుబడితో ఉద్యోగం నుంచి తొలగించాడని తెలిపారు. అతను గతంలో ఓ మందు బాటిల్ ను దొంగతనం చేశాడని వారు ఆరోపించారన్నారు. తాను పిలవకున్నా జాన్ తో పాటు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి తన ఇంటికి వచ్చారని వెల్లడించారు. తాను అరగంట పాటు వారికి నచ్చజెప్పానన్నారు. చివరికి తన చొరవతోనే ఆ వ్యక్తికి ఉద్యోగం తిరిగి దొరికిందని చింతమనేని పేర్కొన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని చింతమనేని హితవు పలికారు.