Pawan Kalyan: నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మూడు రోజులు అన్నం తినలేవు!: పవన్ కల్యాణ్ పై చింతమనేని ఆగ్రహం
- నటుడిగా నిన్ను అభిమానిస్తా
- ప్యాకేజీ తీసుకునే రాఫెల్ పై మౌనంగా ఉన్నావా?
- అభిమానులు బాధ పడతారనే వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు
తాను వ్యక్తిగత విమర్శలకు దిగితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులు భోజనం చెయ్యడని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. ఓ నటుడిగా పవన్ ను తాను అభిమానిస్తానని చెప్పారు. పవన్ అభిమానులు బాధపడకూడదన్న ఉద్దేశంతోనే తాను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదన్నారు. నిన్న దెందులూరు బహిరంగ సభలో పవన్ విమర్శల నేపథ్యంలో చింతమనేని ఈరోజు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
ఎంత ప్యాకేజీ తీసుకున్నావ్ పవన్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తనను ఓ రౌడీగా, గూండాగా పరిచయం చేసేందుకు పవన్ కల్యాణ్ చాలా తాపత్రయ పడ్డాడని చింతమనేని విమర్శించారు. చంద్రబాబు తనకు విప్ పదవిని ఇస్తే, పవన్ చీఫ్ విప్ అని చెబుతున్నాడనీ, రెండింటికీ ఉన్న కనీస తేడా కూడా పవన్ కల్యాణ్ కు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
తొలుత హోదా హోదా అని అరిచిన పవన్.. ప్యాకేజీని ‘పాచిపోయిన లడ్డూ’ అని చెప్పారని చింతమనేని గుర్తుచేశారు. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై దేశమంతా అట్టుడుకుతుంటే, పవన్ మాత్రం నోరు మెదపడం లేదన్నారు. ఆ పాచిపోయిన లడ్డూ(ప్యాకేజీ) కారణంగానే పవన్ నోరు మూతపడిందా? అని ప్రశ్నించారు.
18 ఏళ్ల పిల్లాడు పోటీ చేయలేడని తెలియదా?
ఓ బజారు నాయకుడిలాగా దిగజారి దెందులూరులో మాట్లాడాల్సిన అవసరం పవన్ కు ఏమొచ్చిందని చింతమనేని ప్రశ్నించారు. తనపై 18 ఏళ్ల వయసున్న కుర్రాడిని పోటీకి పెడతానని పవన్ చెప్పడంపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుందే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాదన్న విషయం పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ రాసిచ్చినవాళ్లకు తెలిసి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. తాను నిజంగా రాజ్యాంగేతర శక్తినని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చింతమనేని సవాల్ విసిరారు.