sriram: నోట్లు పంచకుంటే 'శ్రీరాముడు' పోటీ చేసినా ఓట్లు పడవు!: ఆరెస్సెస్ నేత సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాలు డబ్బుమయంగా మారాయి
- యువత, మహిళలే పార్టీలకు కనిపిస్తున్నారు
- బీజేపీ కూడా మిగతా పార్టీల్లాగే తయారయింది
ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మద్దతుతో పాటు దండిగా డబ్బు కూడా వుండాలి. కావాల్సినంత ధనబలం లేకుంటే ప్రస్తుతమున్న రాజకీయాల్లో కేడర్ ను కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) గోవా మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో నోట్లు పంచకుంటే సాక్షాత్తూ శ్రీరాముడికి కూడా ఓట్లు రావనీ, గెలవలేడని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోవా సురక్ష మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్.. ఈ సభకు హాజరైన యువతను ఉద్దేశించి మాట్లాడారు.
‘ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు జనాభాలో అధికంగా ఉన్న యువత, మహిళలే ముఖ్యం. వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు ఎంత ఖర్చుకయినా వెనుకాడవు. ఇప్పటి రాజకీయాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకుంటే గెలవడం అన్నది చాలా కష్టం. ఇప్పటి పరిస్థితుల్లో స్వయంగా శ్రీరాముడే దిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా డబ్బులు పంచకుంటే గెలవడం అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన విలువలకు తిలోదకాలు ఇచ్చి మిగతా పార్టీల మాదిరి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
అనారోగ్యం సాకుగా చూపుతూ గోవా సీఎం మనోహర్ పారికర్ ఇటీవల ఇద్దరు మంత్రులను తొలగించారనీ, మరి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పారికర్ ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. చిన్నచిన్న రోగాలకు సైతం చికిత్స తీసుకునేందుకు రాజకీయ నాయకులు అమెరికా వెళ్లడాన్ని సుభాష్ తప్పుపట్టారు.