America: అమెరికాలోని భారతీయుల్లో మళ్లీ ‘వీసా’ టెన్షన్.. గడువు ముగిస్తే అక్టోబర్ ఒకటి తర్వాత ఇక వెనక్కే!
- గడుపు పొడిగింపునకు అగ్రరాజ్యం నో
- ఒకటి నుంచి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలు
- హెచ్1బీ, కారుణ్య అభ్యర్థులకు మినహాయింపు
ఉపాధి వెతుక్కుంటూ అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులకు వీసా టెన్షన్ పట్టుకుంది. గడువు పెంచేందుకు అగ్రరాజ్యం నో అంటోంది. ఇందుకు సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధన మేరకు గడువు ముగిసిన వారిని బయటకు పంపిస్తారు. దీంతో స్వదేశానికి ప్రయాణంకాక తప్పని పరిస్థితి నెలకొంది.
కాకపోతే హెచ్1బీ వంటి ఉద్యోగ సంబంధ వీసాలు, కారుణ్య అభ్యర్థన చేసుకున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. గత కొన్నినెలలుగా అమెరికా వీసా పొడిగింపు దరఖాస్తులను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధన అమల్లోకి వస్తే చాలామంది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారు వలస న్యాయమూర్తి ముందు హాజరు కావాలని నోటీసులు పంపించనున్నారు.