Section 497: నాడు తండ్రి ఇచ్చిన తీర్పును నేడు విభేదించిన తనయుడు!
- 33 ఏళ్ల క్రితం సెక్షన్ 497 ఉండాలన్న జస్టిస్ వైవీ చంద్రచూడ్
- వివాహేతర బంధం నేరం కాదంటూ నిన్న తీర్పిచ్చిన డీవై చంద్రచూడ్
- వ్యక్తిగత గోప్యతా హక్కు విషయంలోనూ తండ్రితో విభేదం
- మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న తీర్పులు
దాదాపు 33 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన ఓ తీర్పును, నేడు అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కుమారుడు డీవై చంద్రచూడ్ తిరస్కరించారు. తన తండ్రి ఇచ్చిన తీర్పును ఆయన వ్యతిరేకించడం ఇది రెండోసారి.
జస్టిస్ వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో 1985లో ఓ వివాహేతర సంబంధం కేసు కోర్టు విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు ఆర్ఎస్ పాఠక్, ఏఎన్ సేన్ లతో కలిసి కేసును విచారించిన వైవీ చంద్రచూడ్, వివాహేతర సంబంధాలు పెట్టుకునేది సాధారణంగా పురుషులేనని, అయితే, కాలం మారే కొద్దీ పరిస్థితిలోనూ మార్పు వస్తుంది కాబట్టి, ఎప్పటికప్పుడు సమాజంలోని మార్పులు గమనించి సెక్షన్ 497కు మార్పులు చేసుకోవచ్చని, దీన్ని ప్రస్తుతం కొట్టివేయలేమని తీర్పిచ్చారు.
ఇవే వివాహేతర బంధాలపై నిన్న జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరిపిన న్యాయమూర్తుల్లో వైవీ చంద్రచూడ్ కుమారుడు డీవీ చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఆయన కేసు విచారణ సమయంలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, సెక్షన్ 497ను కొట్టివేయాలని తీర్పునిచ్చారు. లైంగిక స్వతంత్రతను గౌరవించాలని, వివాహం తరువాత ఓ పురుషుడికి మహిళ అధీనమయ్యే పరిస్థితిని కల్పిస్తున్న ఈ సెక్షన్ అవసరం లేదని అన్నారు.
అంతకుముందు వ్యక్తిగత గోప్యతా హక్కు విషయంలోనూ ఈ తండ్రీ కొడుకులు వేర్వేరు తీర్పులను వెలువరించారు. 1976లో అప్పటి సీజే ఏఎన్ రే ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వ్యక్తిగత గోప్యతపై విచారించిన వేళ, జస్టిస్ వైవీ చంద్రచూడ్ బెంచ్ లో ఉన్నారు. ఇది ప్రాథమిక హక్కేనని బెంచ్ లోని జస్టిస్ ఖన్నా తీర్పు వెలువరించగా, కాదంటూ చంద్రచూడ్ సహా మిగిలిన నలుగురూ పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు డీవై చంద్రచూడ్ నాటి ఖన్నా తీర్పును బలపరుస్తూ, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొనడం గమనార్హం.