Revanth Reddy: 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రేవంత్ పై... ఇప్పుడే దాడులు ఎందుకు?: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- ఐటీ దాడులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే
- ఇంకా ఎంత మందిని టార్గెట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది
- టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, అతని బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు తెలంగాణలో వేడిని పుట్టిస్తున్నాయి. ఈ దాడులు ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనని ఏఐసీసీ సభ్యుడు, తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మొన్న జగ్గారెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి... ఇంకా ఎంత మందిని టార్గెట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారని... ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. దాడుల వెనకున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... రంగాయచెరువు రిజర్వాయర్ ను నిర్మిస్తామని మాధవరెడ్డి తెలిపారు. గతంలో రూ. 330 కోట్ల నిధులతో కాంగ్రెస్ పార్టీ రంగాయచెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించిందని... మంత్రి హరీష్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిలు రీడిజైనింగ్ పేరుతో రిజర్వాయర్ పనులను నిలిపివేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు