Maoists: కిడారి, సోమల హత్యకేసులో వెలుగు చూస్తున్న నిజాలు.. విస్తుపోతున్న పోలీసులు!
- దాడికి సూత్రధారి చలపతే
- రెండు వారాల క్రితం వరకూ ఏజన్సీలో
- వాకీటాకీలతో సమాచారం
- హత్యల తరువాత 'ఆపరేషన్ సక్సెస్' అన్న మావోలు
గడచిన ఆదివారం నాడు విశాఖ జిల్లా ఏజన్సీ ప్రాంతంలోని లివిటిపుట్టు వద్ద జరిగిన కిడారి, సోమల జంట హత్యల కేసును విచారిస్తున్న పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెస్తున్నారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, లివిటిపుట్టు ఆపరేషన్ లో మావోయిస్టు నేత చలపతిదే కీలక పాత్ర. స్వయంగా ఈ హత్యల్లో పాల్గొనక పోయినా, పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు జరిగాయి.
చలపతి తన భార్య అరుణకు, మొత్తం మావోల టీమ్ ను సమన్వయపరిచే బాధ్యతలను అప్పగించాడు. కిడారి సర్వేశ్వరరావు హత్యకు రెండు నెలల ముందు నుంచే వ్యూహం పన్నిన చలపతి, వాకీటాకీలను వాడుతూ, తన సహచర మావోలకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ మేరకు బెజ్జంగి అడవుల్లో వాకీటాకీ కనెక్టివిటీ పాయింట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాకీటాకీల ద్వారా ఎప్పటికప్పుడు చలపతి సూచనలు తీసుకుంటూ, 60 మంది మావోలు విడివిడిగా లివిటిపుట్టు ప్రాంతానికి చేరుకున్నారు.
ఘటన తరువాత 'ఆపరేషన్ సక్సెస్' అని హత్యలో పాల్గొన్న మావోలు చలపతికి చెప్పినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ హత్యాకాండ ముగిసేంత వరకూ బెజ్జంగి అడవుల్లోనే ఉన్న చలపతి, ఆ తరువాత అక్కడి నుంచి నిష్క్రమించాడని పోలీసులు కనిపెట్టారు. ఈ ఆపరేషన్ కోసం కొంతమంది మావోలను ప్రత్యేకంగా ఎంపిక చేసిన చలపతి, వారికి సాయుధ శిక్షణ, సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చాడని పోలీసులు భావిస్తున్నారు.
గత నెల చివరి వారంలో విశాఖ ఏజన్సీ ప్రాంతంలోనే మకాంవేసిన చలపతి, జీకే వీధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో పలుమార్లు సమావేశమైనట్టు కూడా కేసును విచారిస్తున్న పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చలపతి చత్తీస్ గఢ్ లేదా ఒడిశా ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నామని పోలీసు వర్గాలు అంటున్నాయి.