assam: చదువుకోసం ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతున్న పిల్లలు!
- అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో ఘటన
- చేతులతో తెడ్డు వేసుకుంటూ వెళుతున్న చిన్నారులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
సాధారణంగా వర్షం పడినా, టీచర్ రాకపోయినా స్కూల్ లో పిల్లలు చేసుకునే సంబరాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే నాలుగు చినుకులు పడగానే పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తారు. స్కూలుకు సెలవు వచ్చినా, ఇంట్లో వాళ్లు బడికి వెళ్లవద్దని చెప్పినా ఆ రోజు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అస్సాంలోని బశ్వనాథ్ జిల్లాల్లో ఉన్న పిల్లలు అలాకాదు. స్కూలుకు వెళ్లేందుకు అక్కడి చిన్నారులు ఏకంగా వాగును దాటుతున్నారు. పెద్దగా ఉండే అల్యూమినియం గిన్నెల్లో కూర్చుని వీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
బిశ్వనాథ్ జిల్లాలోని సూతియా గ్రామానికి చెందిన చిన్నారులు స్కూలుకు వెళ్లడానికి ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఊరికి అవతల ఉండే ప్రాంతంలో స్కూలు ఉండటంతో చేతులతో తెడ్డు వేసుకుంటూ వీరు వాగును దాటుకుంటూ చదువుకోవడానికి వెళుతున్నారు. అధికారులు గ్రామస్తుల కోసం పడవ, వంతెన వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ బోర్దాఖూర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తాను సిగ్గుపడుతున్నానని తెలిపారు. పిల్లలు వాగు దాటేందుకు పడవను ఏర్పాటు చేస్తామన్నారు.