Andhra Pradesh: ఏపీలో మళ్లీ అధికారంలోకొచ్చేది టీడీపీయే: పరిటాల సునీత
- పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రన్నే మళ్లీ రావాలి
- రాష్ట్ర భవిష్యత్తు మహిళల చేతుల్లోనే ఉంది
- బ్యాంక్ లకు వంద శాతం డబ్బు చెల్లించేది డ్వాక్రా మహిళలే
ఏపీలో మళ్లీ అధికారంలోకొచ్చేది టీడీపీయే అని మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో ‘చంద్రన్న పసుపు-కుంకుమ’, వడ్డీ రాయితీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న మండల సమాఖ్య నాయకులు, వెలుగు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ, చంద్రన్న మళ్లీ అధికారంలోకొస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. డ్వాక్రా మహిళల గురించి ఆమె ప్రస్తావిస్తూ, బ్యాంకులకు వంద శాతం డబ్బు చెల్లించేది డ్వాక్రా మహిళలేనని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మహిళల చేతుల్లోనే ఉందని, ప్రభుత్వం, ప్రజలకు సారథిలా సాధికారమిత్రలను నియమించామని చెప్పారు.
ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రూ.2,541 కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చామని, మూడు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.8 వేల చొప్పున రూ.6,833 కోట్లు ఇచ్చామని అన్నారు. మిగతా రూ.2 వేలు దసరా కానుకగా అదజేస్తామని, చంద్రన్న పసుపు-కుంకుమను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ఈ సదస్సుకు ఎమ్మెల్సీలు రామకృష్ణ, మాణిక్య వరప్రసాద్, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు.