Chandrababu: ఐక్యరాజ్యసమితిలో నా ప్రసంగానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి: సీఎం చంద్రబాబు
- ఎక్కడికెళ్లినా మన మాతృభాషను గౌరవించుకోవాలి
- ‘తెలుగు’కు ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం తీసుకొస్తా
- యూఎస్ పర్యటనలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి
తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఐక్యరాజ్యసమితి వేదికపై నుంచి తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తన అమెరికా పర్యటన విశేషాల గురించి ప్రస్తావించారు.
ఐక్యరాజ్యసమితిలో తన ప్రసంగానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయని, ఎక్కడికి వెళ్లినా మన మాతృభాషను గౌరవించుకోవాలని సూచించారు. తెలుగు భాషకు ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని, ఇందుకోసం తన అమెరికా పర్యటనను వినియోగించుకున్నానని చెప్పారు. ప్రకృతి సేద్యం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, రసాయన ఎరువుల వల్ల భూమి నిస్సారమవుతుందని అన్నారు. మూడున్నర లక్షల మంది రైతులు 3.5 లక్షల ఎకరాల్లో ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రకృతి సేద్యం చేస్తున్నారని, పాలేకర్ కనిపెట్టిన ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
అమెరికా పర్యటనలో పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని చంద్రబాబు చెప్పారు. సౌరవిద్యుత్ పరికరాల తయారీలో పేరున్న ట్రైటన్ సోలార్ సంస్థ ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు చెప్పుకొచ్చారు. ఏపీలో పరిశోధన, సాంకేతిక కేంద్రం ఏర్పాటుకు డోయర్ సంస్థ అంగీకారం తెలిపిందని, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ పై భారత ఎంటర్ ప్రైజెస్ తో చర్చించామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో టవర్ల ఏర్పాటు, ఫైబర్ గ్రిడ్ అనుసంధానంపై చర్చలు జరిపామని పేర్కొన్నారు.