temples: అక్కడి ఆలయాల్లోకి మహిళలకు... ఇక్కడి ఆలయాల్లోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం!
- దేశంలో నిషేధం కొనసాగుతున్న పీఠాలు, ఆలయాలు మరెన్నో
- అయ్యప్ప ఆలయంపై కోర్టు తీర్పుతో ఇప్పుడు వెలుగులోకి
- ఏపీలో విశాఖ, విజయవాడల్లో రెండు పీఠాలు
దేశంలో మహిళలకు ప్రవేశం లేనిది శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం మాత్రమేనా? ఇంకెక్కడా అటువంటి ఆంక్షలు లేవా? అంటే ‘అబ్బో...అదేం లేదండి, ఇంకా బోలెడు ఉన్నాయంటున్నారు’ పరిశీలకులు. అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడీ చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. దేశంలోని చాలా ఆలయాలు, మందిరాలు, పీఠాలు ఇటువంటి వివక్ష పాటిస్తున్నాయని చెబుతున్నారు.
ఇందులో కొన్నింటిలోకి మహిళలకు ప్రవేశం లేకపోతే, మరికొన్ని చోట్ల పురుషులకు ప్రవేశం లేకపోవడం గమనార్హం. ఉదాహరణకు, అసోం రాజధాని గువహటిలోని కామాఖ్య ఆలయం. దేశంలోని 51 శక్తి పీఠాల్లో ఇదొకటి. ఇక్కడ మహిళలే పూజార్లు. ఈ పీఠంలో ఏటా నాలుగు రోజులపాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ రోజుల్లో రుతుక్రమంలో ఉన్న స్త్రీలకు ప్రవేశం కల్పించరు.
కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం. రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్‌లో ఉన్న కార్తికేయ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. మహిళలు ఈ ఆలయ ప్రాంగణంలో మాట్లాడితే నీలాపనిందలపాలవుతారన్నది ఓ నమ్మకం. అందుకే స్త్రీలు ఆలయం చుట్టుపక్కలకు కూడా వెళ్లే సాహసం చేయరు.
విజయవాడలో ఉన్న భవానీ దీక్షా మంటపం ప్రధానార్చకురాలు మహిళే. అయినా మంటపంలోకి మహిళలను అనుమతించరు. ఉత్తర ప్రదేశ్‌లో వేలాది ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మ ఆయంలోకి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ మహిళలు మాత్రం కనిపించరు.
ఇక పురుషులకు ప్రవేశం లేని ఆలయాల విషయానికి వస్తే... విశాఖ సమీపంలోని దేవిపురంలో ఉన్న కామాఖ్య పీఠం ఒకటి. ఈ పీఠంలో నారీపూజ జరిగేటప్పుడు మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. తమిళనాడు కన్యాకుమారి వద్ద అమ్మాన్ దేవాలయంలోనూ ఈ ప్రత్యేకత ఉంది. దుర్గాదేవి కొలువుదీరి ఉన్న ఈ ఆలయంలోకి పురుషులను అనుమతించరు. సన్యాసులను కనీసం సింహద్వారం వరకైనా రాణిస్తారు. పెళ్లయిన పురుషులను గుడి ప్రాంగణంలోకి కూడా అనుమతించరు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న మాతా ఆలయంలోకి రుతుక్రమం రోజుల్లో కూడా మహిళలకు ప్రవేశం కల్పిస్తారు. కానీ పురుషులను మాత్రం రానివ్వరు.