maoist: బలిమెల ప్రాంతంలో మావోయిస్టుల కలకలం.. రైతులకు మద్దతుగా బ్యానర్లు!
- లాంచీలకు కట్టిన మావోయిస్టులు
- తాజాగా ఇద్దరు నేతల హత్యతో ఉనికిలోకి
- భారీగా కూంబింగ్ చేపడుతున్న బలగాలు
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో ఉన్న బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో మావోయిస్టుల కలకలం చెలరేగింది. దాదాపు రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోలను పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మావోలు స్థానికంగా తిరిగే లాంచీలకు హెచ్చరిక బ్యానర్లు కట్టారు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ఏడు గిరిజన పంచాయితీల్లోని పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని అందులో తెలిపారు.
ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలనీ, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇక్కడి జంత్రి నుంచి జాంబై ప్రాంతానికి వెళుతున్న లాంచీలకు మావోయిస్టులు బ్యానర్లను కట్టారు. 2008, జూన్ 29న కూంబింగ్ చేపట్టి లాంచీలో తిరిగి వస్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై మావోలు ఒక్కసారిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నీటి మధ్యలో చిక్కుకోవడం, చుట్టుపక్కల నుంచి బుల్లెట్లు, గ్రనేడ్ల వర్షం కురవడంతో దాదాపు 38 మంది గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి తర్వాత ఇక్కడ చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ 2016, అక్టోబర్ లో పక్కా నిఘా సమాచారంతో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చి ప్రతీకారం తీర్చుకున్నాయి. తాజాగా అరకు ఎమ్మెల్యే, టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యలతో విశాఖ ఏజెన్సీతో పాటు ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఇక్కడ భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి.