Anantapur District: అనంతపురం జిల్లా పోలీసుల రెడ్ అలర్ట్ : ప్రజాప్రతినిధుల కదలికలపై నిఘా
- విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే హత్య ఘటనతో అప్రమత్తం
- జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచన
- సెట్ టాక్ కాన్ఫరెన్స్‌లో సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ
గత కొన్నాళ్లుగా అనంతపురం జిల్లాలో మావోయిస్టుల కదలికలే లేవని చెప్పుకొస్తున్న అనంతపురం జిల్లా పోలీసులు విశాఖ ఏజెన్సీ ఘటనతో అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల్ని తక్కువ అంచనా వేయకూడదన్న ఉద్దేశానికి వచ్చినట్లున్నారు. ఏజెన్సీలో మావోయిస్టులు పూర్తిగా ఉనికి కోల్పోయారని అతివిశ్వాసానికి పోయిన విశాఖ పోలీసులకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపడం ద్వారా మావోయిస్టులు గట్టి షాకిచ్చినట్లయింది.
ఈ ఘటన అనంతపురం జిల్లా పోలీసులను అలెర్ట్ చేసింది. ఇప్పటి వరకు మంత్రుల పర్యటన, వారి కార్యక్రమాలపైనే దృష్టిపెట్టిన పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల కదలికపైనా నిఘా ఉంచాలని నిర్ణయించారు. జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ జి.వి.జి.అశోక్‌కుమార్ శుక్రవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
జిల్లాలోని ప్రజాప్రతినిధుల రోజువారీ కార్యక్రమాలను రెండు రోజుల ముందే సేకరించి అందుకు అనుగుణంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ఒకప్పుడు జిల్లాలోని ఉరవకొండ ప్రాంతంలో పెన్నహో బిళం దళం, బుక్కపట్నం, పుట్టపర్తి, నల్లమల ప్రాంతాల్లో చిత్రావతి దళం, కనకగానపల్లె తదితర మండలాలు, కడప జిల్లా గాలివీడు కేంద్రంగా కదిరి నియోజకవర్గం సరిహద్దుల్లో మరికొన్ని దళాలు చురుకుగా ఉండేవి. పోలీసులు ఉక్కుపాదం మోపడంతో 2007-08 నాటికి జిల్లాలోని దళాలన్నీ కనుమరుగయ్యాయి.
2008 తర్వాత జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, ఆ తర్వాత ఒక్క సంఘటనా జరగక పోవడమే ఇందుకు ఉదాహరణ అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఏటా మావోయిస్టుల ప్రభావిత జిల్లాల జాబితా నుంచి కూడా అనంతపురంను తొలగించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఘటన అనంతపురం జిల్లా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. విశాఖ ఏజెన్సీలో తొమ్మిది నెలుగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు సంచలన ఘటనతో మళ్లీ వెలుగులోకి రావడంతో, అటువంటి అవకాశం అనంతపురం జిల్లాలో ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అలెర్ట్ అయ్యారు.