Andhra Pradesh: ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ పథకంపై దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర!
- ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని మండిపాటు
- వెబ్ సైట్ పనిచేయకుంటే 5 లక్షల మంది దరఖాస్తు ఎలా చేశారు?
- దరఖాస్తు చేసిన అందరికీ నగదు ఇస్తాం
నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకంపై ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు జడుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ఈ పథకం అమలులో చాలా లోపాలు ఉన్నాయనీ, వెబ్ సైట్ పనిచేయడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు వెబ్ సైట్ పనిచేయకుంటే దాదాపు 5 లక్షల మంది యువత ఎలా దరఖాస్తు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అక్టోబర్ 2 నాటికి ఎంత మంది యువత దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ నిరుద్యోగ భృతిని అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులై ఉండాలి. కనీస విద్యార్హతగా డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. వయసు 22- 35 ఏళ్ల మధ్య ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాల్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా అందరినీ అర్హులుగా ప్రకటిస్తారు. లబ్ధిదారులని పేరుపై ఫోర్ వీలర్ ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. అలాగే 2.50 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి తమపేరుపై కలిగి ఉన్న వ్యక్తులు కూడా అనర్హులు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 50 వేలకుపైగా రుణం పొందిన అభ్యర్థులకూ ఈ పథకం వర్తించదు.