Uttar Pradesh: పోలీసుల కాల్పుల్లో ఐటీ ఉద్యోగి మృతి.. తనిఖీల సందర్భంగా కారు ఆపకుండా వెళ్లడంతో ఘటన!

  • యూపీలోని గోమతినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన
  • ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు
  • ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్‌

ఐటీ ఉద్యోగి తొందరపాటు, పోలీసుల నిర్లక్ష్యం వెరసి ఓ నిండుప్రాణం బలైంది. తమ తనిఖీలలో భాగంగా కారును ఆపలేదన్న కారణంతో దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అందులో ఉన్న ఐటీ ఉద్యోగి తీవ్రంగా గాయపడి అనంతరం ఆస్పత్రిలో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని గోమతినగర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 1.30గంటల తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.

తివారి (38) అనే ఐటీ ఉద్యోగి ఆపిల్‌లో పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి కారులో తన సహచర ఉద్యోగినితో కలసి వస్తున్నాడు. గోమతినగర్‌ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో తివారి వస్తున్న కారును ఆపారు. అయితే తివారి కారు ఆపకుండా పోలీసుల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్‌ కారుపైకి కాల్పులు జరపడంతో తివారికి బుల్లెట్‌ తగిలింది. దీంతో కారు అదుపుతప్పి సమీపంలోని గోడను ఢీకొట్టింది.

‘కారులో ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పైగా మా బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదాన్ని ఊహించి ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపాం’ అని చెబుతున్నాడు కానిస్టేబుల్‌ ప్రశాంతకుమార్‌. తివారితోపాటు కారులో ప్రయాణిస్తున్న యువతి కథనం మరోలా ఉంది. ‘ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పోలీసులు బలవంతంగా మా కారును ఆపబోయారు. కారు ఆపుతున్నది ఎవరో అర్థంకాక సార్‌ (తివారి) వారిని తప్పించుకుని పక్కనుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు వారి బండిని ఢీకొట్టింది. వెంటనే బండిదిగిన కానిస్టేబుళ్ళలో ఒకరు రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు’ అని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై తివారి భార్య కల్పన తీవ్రంగా స్పందించారు. ‘కారు ఆపనంత మాత్రాన కాల్చిచంపేస్తారా? పోలీసులకు ఎవరిచ్చారీ హక్కు? దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలి’ అంటూ ఆమె డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News