Chennai: ఆ జర్నలిస్టు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి.. వైరల్ అవుతున్న వీడియో!
- అండగా ఉంటానని నమ్మించి వేధింపులు
- వాట్సాప్, సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు
- లొంగకుంటే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరింపు
సీనియర్ జర్నలిస్టు ఒకరు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, లొంగకుంటే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరిస్తున్నాడంటూ చెన్నైకి చెందిన 42 ఏళ్ల నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 8 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఆమె.. జర్నలిస్టు ప్రకాశ్ ఎం.స్వామి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, 2016 నుంచి సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.
తన కుమారుడికి పాస్‌పోర్టు విషయంలో దరఖాస్తు చేసే నెపంతో తన ఇంటికొచ్చి శారీరకంగానూ వేధించాడని ఆరోపించింది. ఆమె ఆరోపణలను స్వామి ఖండించాడు. తానెప్పుడూ ఆమె ఇంటికి వెళ్లలేదని పేర్కొన్నాడు. ఆమెకు వ్యతిరేకంగా తానో స్టోరీని సిద్ధం చేస్తున్నానని, ఈ విషయం తెలిసే ఆమె తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని వివరించాడు.
2016లో హాంకాంగ్‌లో తన భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్వామి తనను కలిశాడని నటి పేర్కొంది. తన కుమారుడికి పాస్ పోర్టు కోసం సాయం చేస్తానని చెప్పడంతో అతడితో టచ్‌లో ఉన్నానని తెలిపింది. అయితే, అతడి ప్రవర్తనలో తేడాను గుర్తించానని, ఇటీవల ఆయన తన ఇంటికి సమీపంలోనే ఇంటిని తీసుకుని తనను వేధించడం మొదలుపెట్టాడని వివరించింది.
సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, తన భర్తను తాను చంపేసినట్టు ఆరోపణలు చేసి అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వాపోయింది.
కాగా, నటిని వేధిస్తున్న ప్రకాశ్ దేశంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేసినట్టు అతడి ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఐక్యరాజ్య సమితికి కరెస్పాండెంట్‌నని, ఎమ్మీ అవార్డులుకు న్యాయమూర్తిగా ఉన్నానని, అమెరికా తమిళ సంఘానికి అధ్యక్షుడినని అందులో రాసుకున్నాడు.