ap cs anil chandra: ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠ
- సీఎస్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది
- ఈ పదవి చాలా సవాళ్ళతో కూడుకుంది
- మెరుగైన ఫలితాలు సాధిస్తాం: పునేఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠ బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు ఆదివారం అమరావతి సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి చాంబర్ లో ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ నుండి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ పునేఠ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు.
‘సీఎస్’ అనేది చాలా సవాళ్ళతో కూడుకున్న పదవని, అందులోనూ నూతన రాష్ట్రం అయినందున అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. అలాగే, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని మెరుగైన రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని అన్నారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆదాయం పెంపొందించే విధంగా వారి జీవన విధానం మరింత మెరుగుపడే రీతిలో అన్ని కుంటుంబాలు ఆనందదాయకంగా జీవించేలా ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తానని అనిల్ చంద్ర పునేత అన్నారు. వివిధ పథకాలు గ్రామ స్థాయి వరకూ ఎంత మేరకు అమలవుతున్నాయనేదే కాకుండా ఫలితాలు ఏవిధంగా సాధిస్తున్నామనే అంశంపై ప్రత్యేక దష్టి సారించి జిల్లా కలెక్టర్ మొదలు గ్రామ స్థాయి వరకూ రిజల్ట్ ఓరియెంటెడ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకుగాను కార్యదర్శిలు, శాఖాధిపతులు, కలెక్టర్లు అందరం ఒక టీంగా పని చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.35 ఏళ్ల ఉద్యోగ సర్వీసులో మీకు అత్యంత సంతోషాన్ని కలిగించిన సంఘటన ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు పునేఠ సమాధానమిస్తూ.. తన మొదటి ఉద్యోగ బాధ్యత రాజంపేట సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడి పేదలకు ఇళ్లు, 3 నుండి 5 ఎకరాలు వంతున భూములు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గుర్తు చేసుకున్నారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వచ్చే మంత్రి వర్గ సమావేశానికి రానున్న కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన ర్యాటిఫికేషన్ దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేసినట్టు తెలిపారు.
అంతకుముందు, శ్రీశైలం, తిరుపతి దేవస్థానాల నుండి వచ్చిన పురోహితులు, వేదపండితులు పునేఠకు ఆశీర్వచం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా, సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన పునేఠకు పలువురు అభినందనలు తెలిపారు.