Hyderabad: అక్కాచెల్లెళ్లు, నర్సు, వ్యాపారి... హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి అదృశ్యం!
- సికింద్రాబాద్ లో ఓ నర్సు అదృశ్యం
- చాంద్రాయణగుట్టలో దర్గాకు వెళ్లి తిరిగిరాని తులసి, రాగిణి
- డబీర్ పురా పరిధిలో ఇమాంబి అదృశ్యం
- కేసులు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు అదృశ్యం కావడంతో, వారి బంధువులు, కుటుంబీకుల ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ తీసుకుంటున్న అడ్డగుట్ట శాస్త్రినగర్ కు చెందిన స్వప్న (19), 28వ తేదీ ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమెకోసం తల్లి ఎల్లమ్మ ఆసుపత్రికి వెళ్లగా, స్వప్న రాలేదని చెప్పడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చాంద్రాయణగుట్ట పరిధిలోని హనుమాన్ నగర్ కు చెందిన అక్కా చెల్లెళ్లు తులసి (19), రాగిణి (14), సెప్టెంబర్ 14న దర్గాకు వెళుతున్నామని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.
చార్మినార్ సమీపంలోని డబీర్ పురాలో ఇమాంబి అనే మహిళ, అజ్మీర్ వెళ్లి వస్తానని చెప్పి సెప్టెంబర్ 13న వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఇమాంబీ కుమార్తె ఫాతిమా పోలీసులను కలిసి, రిపోర్ట్ చేశారు.
ఈస్ట్ మారేడుపల్లిలో ఈ-సేవా సెంటర్ నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్, సెప్టెంబర్ 26 నుంచి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ పనిచేయక పోవడంతో, భార్య జ్యోతి తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించింది. ఈ అదృశ్యాలపై కేసులను నమోదు చేసిన పోలీసులు, దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.