Bank loan: గంటలో బ్యాంక్‌ రుణం... అదీ బ్యాంకుకు వెళ్లక్కర్లేకుండానే!: ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌

  • సరికొత్త వెబ్‌ పోర్టల్‌ సాయంతో అందిస్తామని ఆర్థిక శాఖ భరోసా
  • వ్యక్తిగత, గృహ రుణాలకు వర్తింపు
  • ధ్రువపత్రాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది

‘బ్యాంక్‌ రుణం అంటే అబ్బో అదో పెద్ద జంజాటం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. సవాలక్ష ప్రశ్నలు, పదుల సంఖ్యలో ధ్రువపత్రాలు, రికమెండేషన్‌లు, ష్యూరిటీలు...తీరా వారు చెప్పినవన్నీ చేసినా కనికరిస్తారో లేదో చెప్పలేం’... ఇదీ సగటు ఖాతాదారుడి అభిప్రాయం. ‘అయితే మీకా అనుమానం అక్కర్లేదు, దరఖాస్తు చేసిన గంటలో అదీ మీరు బ్యాంక్ శాఖకు వెళ్లకుండానే రుణం పొందే అవకాశం కల్పిస్తాం’... అని భరోసా ఇస్తోంది ఆర్థిక శాఖ.

ఇందుకోసం ఇటీవల ప్రారంభించిన 'www.psbloansin59minutes.com' వెబ్‌ పోర్టల్‌లో మార్పులు చేస్తామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. సరైన ధ్రువపత్రాలు కలిగిన వారు పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేస్తే చాలు. అంతా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

వ్యక్తులను కలవాల్సిన అవసరం ఉండదు, బ్యాంక్‌ అధికారుల ప్రమేయం ఉండదు, ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల(ఎంఎస్‌ఎంఈ) నిర్వాహకులు రూ.కోటి వరకు రుణం పొందేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. సిడ్బీ వ్యూహాత్మక చొరవతో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, విజయా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల కన్సార్టియం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది.

ఈ పోర్టల్‌ ద్వారానే వ్యక్తిగత, గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ ప్రకటించింది. 20 నుంచి 25 రోజుల్లో మంజూరయ్యే రుణానికి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గంటలోపే అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు ఖాతాదారుడి ఆదాయపన్ను రిటర్న్‌లు, జీఎస్‌టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను అనలిటిక్స్‌ ద్వారా వేగంగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. రుణం మంజూరైన వారం రోజుల లోపే చెల్లింపు కూడా పూర్తి చేస్తారు.

‘ఆరేడు నెలల్లో ఈ విధానం స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉండడం వల్ల ఎగవేతలు తగ్గుతాయి. తెలిసీ తప్పుడు సమాచారం ఇస్తే కనుక బ్యాంక్‌లు, ట్యాక్స్‌ వసూలు చేసే సంస్థలు పట్టుకుంటాయి, జాగ్రత్త' అని రాజీవ్‌కుమార్‌ హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News