KIdari: మావోలు వారి ఫోన్లు ఎందుకు తీసుకువెళ్లారు?
- హతుల ఫోన్లు తీసుకుపోయిన మావోలు
- కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు
- ఎమ్మెల్యేతో సత్సంబంధాలు నెరిపిన వారిపై పోలీసుల దృష్టి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన అనంతరం వారి ఫోన్లు తీసుకు వెళ్లారని భావిస్తున్నారు. నేతలను చంపిన తర్వాత కొద్ది దూరం వెళ్లిపోయిన మావోయిస్టులు వెనక్కి వచ్చిమరీ ఫోన్లు ఎత్తుకెళ్ళారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
దీంతో నేతల హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్బృందం మావోయిస్టులు వారి ఫోన్లు ఎందుకు పట్టుకు వెళ్లారు? అందులో ఏదైనా విలువైన సమాచారం ఉందా? అన్నదానిపై ఆరాతీస్తోంది. కిడారి, సివేరి ఫోన్లు లేకున్నా తరచూ వారితో వ్యాపార, రాజకీయ అంశాలు మాట్లాడే వారి ఫోన్లపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఈ కారణంగానే ఘటన జరిగిన మూడో రోజు నుంచే అనుమానితులను తీసుకువచ్చి వారి ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సేకరిస్తున్నారు.
రెండు మూడు నెలలుగా వీరు ఎవరెవరితో మాట్లాడారు? ఎమ్మెల్యేతోపాటు ఇంకెవరికి ఫోన్ చేశారు? అన్న అంశాల ఆధారంగా కూపీ లాగాలని ఆలోచిస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల వ్యాపార లావాదేవీలు, భూ వ్యవహారాలు, రాజకీయ మార్పులపై మావోయిస్టులకు తెలిసిన వారి నుంచే సమాచారం వెళ్లిందని ఇప్పటికే పోలీసులు నిర్థారణకు వచ్చారు.
అందుకే కిడారితో సత్సంబంధాలున్న మండల, గ్రామ స్థాయి నాయకులతోపాటు బయట నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపైనా దృష్టిసారించారు. ఒక్కొక్కరినీ పిలిచి మూడు నుంచి నాలుగు గంటలపాటు విచారిస్తున్నారు. ఆ తర్వాత విడిచి పెడుతున్నారు. అయితే డుంబ్రిగుడ సమీపంలోని అంత్రిగుడ అనే పీవీటీజీ గ్రామం నుంచి ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు అందులో ఇద్దరిని మాత్రమే వదిలారు. గెమ్మిలి శోభన్ అనే వ్యక్తిని నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్లు, ఫొటోల సమాచారాన్ని సేకరించి ఘటన తర్వాత ఎవరెవరితో ఫోన్లో మాట్లాడిందీ తెలుసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టులు చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.