Mahabubabad District: కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లిన అమ్మ... బిడ్డను ఆడిస్తూ కూర్చున్న పోలీసు... వైరల్ అవుతున్న ఫొటో!
- మహబూబ్ నగర్ లో ఘటన
- తల్లి పరీక్షకు వెళితే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ను చూపిన హెడ్ కానిస్టేబుల్
- ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి
పోలీసుల్లో మానవత్వం ఉండదని, జనాలను హడలెత్తిస్తుంటారని అనుకునే వారిలో కొందరి మనసులనైనా మార్చేసే ఘటన ఇది. నిన్న పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు జరుగగా, తన నాలుగు నెలల బిడ్డతో కలసి మహబూబ్ నగర్ పరీక్షా కేంద్రం వద్దకు ఓ మహిళ వచ్చిన వేళ ఈ ఘటన చోటు చేసుకుని, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పరీక్ష హాల్ లోకి అభ్యర్థిని తప్ప ఎవరినీ అనుమతించబోరన్న సంగతి తెలిసిందే. తాను పరీక్ష రాసి వచ్చేంత వరకూ పాపను చూసుకునేందుకు బంధువుల అమ్మాయిని వెంట తెచ్చుకుంది. ఆ అమ్మాయి దగ్గర పాపను వదిలిన తల్లి అలా పరీక్ష హాల్ లోకి వెళ్లిందో, లేదో ఏడుపు లంఘించుకుందా బిడ్డ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ముజీబ్ ఉర్ రెహ్మాన్ అనే హెడ్ కానిస్టేబుల్ పాపను చూశాడు.
తాను పోలీసునన్న విషయాన్ని పక్కన బెట్టి, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఉదాహరణగా నిలిచాడు. పాపను చేతుల్లోకి తీసుకుని ఆడిస్తూ కూర్చున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ రమా రాజేశ్వరి ముజీబ్ ఫొటోలు తీసి 'హ్యూమన్ ఫేస్ ఆఫ్ కాప్స్' అనే హ్యాష్ ట్యాగ్ తో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.