YSRCP: గుంటూరు జిల్లా వైసీపీలో ముసలం.. లేళ్ల అప్పిరెడ్డి వర్గీయుల ఆందోళన!
- ఏసురత్నంను ఇన్ చార్జ్ గా నియమించడంపై ఆగ్రహం
- పార్టీ నుంచి వెళ్లిపోదామని డిమాండ్
- కార్యకర్తలను సముదాయించిన నేత
గుంటూరు జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా మాజీ డీఐజీ ఏసురత్నంను వైఎస్ జగన్ ఇటీవల నియమించారు. దీంతో ఈ నిర్ణయంపై లేళ్ల అప్పిరెడ్డి వర్గం తీవ్ర అసహనానికి గురైంది. చాలామంది అనుచరులు ఈరోజు అప్పిరెడ్డి కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. గౌరవం లేనిచోట ఉండొద్దనీ, వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోదామని నినాదాలు ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అప్పిరెడ్డి కార్యకర్తలను సముదాయించారు.
తాము అభ్యంతరం వ్యక్తం చేసినా అయననే ఇన్ చార్జీగా కొనసాగించడంతో పార్టీ నుంచి వెళ్లిపోదామని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. తాము నియోజకవర్గంలో పార్టీని బలపర్చేందుకు పనిచేస్తే సడెన్ గా బయటివ్యక్తికి నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ప్రస్తుతం అప్పిరెడ్డి వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవితో పాటు పశ్చిమం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.