siddharamaiah: రోజుకు 40 సిగరెట్లు కాల్చేవాడిని.. ఇప్పుడు వాటి వాసన కూడా భరించలేను: సిద్ధరామయ్య
- చెడు అలవాట్లకు యువత బానిస కాకూడదు
- క్యాన్సర్ బారిన పడకముందే ధూమపానాన్ని వదిలేయండి
- 31 ఏళ్ల నుంచి సిగరెట్లకు దూరంగా ఉన్నా
చెడు అలవాట్లకు బానిస కాకూడదని, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. మైసూరులో క్యాన్సర్ పరీక్షాశిబిరం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు సిగరెట్లకు తాను బానిసగా మారిపోయానని చెప్పారు. రోజుకు 40 సిగరెట్లు కాల్చేవాడినని అన్నారు.
ఒకసారి తన మిత్రులు విదేశీ సిగరెట్ల పెట్టెను తీసుకొస్తే... అదే రోజు చాలా ఉత్సాహంగా సిగరెట్లన్నింటినీ ఊదేశానని... ఆ తర్వాత తనలో ఒక అపరాధభావం మొదలైందని, సిగరెట్లను మానేశానని చెప్పారు. ఇప్పుడు ఎవరి వద్ద నుంచైనా సిగరెట్ వాసన వస్తే భరించలేనని తెలిపారు. 31 ఏళ్ల నుంచి సిగరెట్లకు దూరంగా ఉన్నానని చెప్పారు.
సిగరెట్ పెట్టెలపై బొమ్మలతో సహా హెచ్చరికలు ఉన్నప్పటికీ... జనాలు వాటిని వదల్లేకపోతుండటం బాధను కలిగిస్తోందని సిద్ధరామయ్య చెప్పారు. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని... అందువల్ల క్యాన్సర్ బారిన పడకముందే దాన్ని వదిలేయాలని సూచించారు.