jawahar: కన్నాకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి: మంత్రి జవహర్
- బీజేపీ ఒక్కసీటు గెలిచినా నేను రాజకీయ సన్యాసమే
- కన్నా, జగన్, పవన్ లది రాష్ట్రంపై విషం చిమ్మే ప్రయత్నం
- పవన్ ‘జనసేన’ని బీజేపీకి రిటైల్ గా అమ్ముతున్నారు
కన్నా లక్ష్మీనారాయణ, జగన్, పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విపక్షాలు ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
విపక్ష నాయకులు తనతో వస్తే తన సొంత డబ్బులతో వారిని రాష్ట్రం మొత్తం తిప్పి జరిగిన అభివృద్ధిని చూపెడతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆరోపణలు చేస్తున్న విపక్ష నాయకులకు దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ జెండాను జేబులో పెట్టుకుని జగన్, పవన్ పనిచేస్తున్నారని, బీజేపీపై నోరెత్తే దమ్ము వీళ్లిద్దరికీ లేదని విమర్శించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్ గా కాంగ్రెస్ కు అమ్మితే, పవన్ జనసేన పార్టీని బీజేపీకి రిటైల్ గా అమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాపపరిహార యాత్ర మూడు వేల కిలోమీటర్లు దాటిందని, ముప్పై వేల కిలో మీటర్లు పొర్లు దండాలు చేసినా జగన్ పాపం పోదని, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం వైసీపీ అజెండా అని దుయ్యబట్టారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, కన్నాకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని జవహర్ కోరారు.