Tamil Nadu: భర్త వివాహేతర సంబంధంపై కేసు పెడతానన్న భార్య.. సుప్రీంకోర్టే అనుమతినిచ్చిందన్న భర్త!
- భర్త వివాహేతర సంబంధంపై ఫిర్యాదు చేస్తానన్న భార్య
- పోలీసుపైనే తిరిగి కోర్టుకెళ్తానన్న భర్త
- మనస్తాపంతో భార్య ఆత్మహత్య
తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దానికా భర్త పకపకా నవ్వుతూ.. ‘‘పిచ్చిదానా, పోలీసులు కూడా ఏమీ చేయలేరే. వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఒకవేళ పోలీసులు నన్నేమైనా అంటే తిరిగి వారిపైనే కోర్టుకెళ్తా. కోర్టు తీర్పును ఉల్లంఘించారని కోర్టుకెక్కుతా’’ అని భార్యనే బెదిరించాడా ప్రబుద్ధుడు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెలుగు చూసిన ఈ పరిణామం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. చెన్నైలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. జాన్‌పాల్ ఫ్రాంక్లిన్ (26), పుష్పలత (24) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫ్రాంక్లిన్ ఓ పార్క్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఏడాది వయసున్న పాప ఉంది. పుష్పలత గత కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతుండడంతో భర్త ఆమెకు క్రమంగా దూరమయ్యాడు. ఆమె మందులకు కూడా డబ్బులివ్వడం మానేశాడు. దీంతో పుష్పలత తన బాధను భర్త స్నేహితుడి దగ్గర చెప్పుకోగా అసలు విషయం బయటపడింది. ఫ్రాంక్లిన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అతడు చెప్పడంతో ఆమె గుండె బద్దలైంది.
విషయం తెలిసిన ఆమె భర్తను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. భార్య హెచ్చరికలకు ఫ్రాంక్లిన్ పకపకా నవ్వుతూ పోలీసులు కూడా ఏమీ చేయలేరని తేల్చి చెప్పాడు. వివాహేతర సంబంధాలు తప్పు కాదంటూ స్వయంగా సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాడు. పోలీసులు కనుక తన జోలికి వస్తే వాళ్ల మీదే కోర్టు ధిక్కార నేరం కింద తిరిగి కేసు పెడతానని చెప్పడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోక, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.