Kidari: హత్య జరిగిన రోజు... కిడారి కారులో రూ. 3 కోట్లు!
- ఘటన తరువాత కనిపించని డబ్బు
- ఆరా తీస్తున్న సిట్ బృందం
- అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిన నాడు ఆయన కారులో రూ. 3 కోట్ల నగదు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. నాడు ఆ డబ్బును మైనింగ్ సెటిల్ మెంట్ కోసం తీసుకెళుతున్నారా? లేక మావోయిస్టులకు ఇచ్చేందుకే పట్టుకెళుతున్నారా? అన్న విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.
హత్య తరువాత కారు నుంచి ఆ డబ్బు మాయం కాగా, దీన్ని మావోలు తీసుకు వెళ్లారా? లేక ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న మరెవరైనా తీసుకెళ్లారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీపీ ధనీరావుతో పాటు కొండబాబు, త్రినాథరావు, అంత్రిగూడకు చెందిన శోభన్, కొర్రా కమల, పొంగిదాసు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.