Donald Trump: 'సుంకాల రారాజు' భారత్: ట్రంప్ వ్యంగ్యం
- మా ఉత్పత్తులపై భారత్ భారీ ఎత్తున సుంకాలను విధిస్తోంది
- మేము కూడా భారత్ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తాం
- నన్ను సంతోషపరిచేందుకు వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమవుతోంది
ద్వైపాక్షిక వాణిజ్య విధానాలపై తమతో చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా, మెక్సికో, కెనడాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలపై ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఆయన భారత్ ప్రస్తావనను తీసుకొచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను విధించడం గురించి మాట్లాడుతూ... తనను సంతోష పరిచేందుకు చర్చలకు ఇండియా సిద్ధమవుతోందని చెప్పారు. ఈ సందర్భంగాను ఇండియాను సుంకాల రారాజుగా ట్రంప్ అభివర్ణించారు.
భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, చైనాలతో వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. భారత్ ఉత్పత్తులపై తాము ఆంక్షలు విధిస్తే తట్టుకోలేమని భావించడం వల్లే... భారత్ వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతోందని చెప్పారు.
అమెరికా దిగుమతులపై భారత్ 100 శాతం సుంకాలను విధిస్తోందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో... అది చేయకూడదని భారత్ భావిస్తోంది. అందుకే వారు మాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ఒప్పందాన్ని గతంలో వారు ఎవరితో చేసుకోలేదు' అని ట్రంప్ చెప్పారు.
తమ ఉత్పత్తులపై భారత్ భారీ ఎత్తున సుంకాలను విధిస్తోందని... భారత ఉత్పత్తులపై తాము సుంకాలను విధించడం లేదని... కానీ, ఇకపై అమెరికాకు వచ్చే భారత ఉత్పత్తులపై 25 శాతం లేదా 10 శాతం లేదా ఎంతో కొంత సుంకాన్ని విధించాలనుకుంటున్నామని తెలిపారు.