dwacra: డ్వాక్రా సంఘాలను టీడీపీ వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకోవద్దు: పవన్ కల్యాణ్
- రుణమాఫీ జరగాలంటే మళ్లీ టీడీపీ కే ఓటు వేయాలా?
- డ్వాక్రాకు ‘హెరిటేజ్’ నుంచి డబ్బు ఇవ్వడం లేదుగా!
- మీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీయండి
రుణమాఫీ జరగాలంటే మళ్లీ టీడీపీకే ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు డ్వాక్రా సంఘాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడొద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాజారాణి కల్యాణ మంటపంలో డ్వాక్రా సంఘాల సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. రుణాలు మాఫీ కాకపోవడంతో వడ్డీ పెరిగి అప్పులు మరింతగా పెరిగిపోయాయని డ్వాక్రా సభ్యులు వాపోయారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ విషయం పట్టించుకోవట్లేదని పవన్ దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, డ్వాక్రా పథకం టీడీపీది కాదని, ఇది అంతర్జాతీయ పథకమని, ఆ పథకాన్నే టీడీపీ అమలు చేస్తోందని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి ఇవ్వడం లేదని, డ్వాక్రా సభ్యులకు ఇచ్చేది ప్రజల డబ్బు అని, మన అందరి ఉమ్మడి సంపద అని చెప్పారు. మీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని బలంగా నిలదీయండి.. సమస్య పరిష్కరిస్తారా? లేదా? అని ప్రశ్నించండి అని పవన్ సూచించారు.
ఆడపడచులపై కేసులు పెట్టి ఇబ్బందిపెడితే ఊరుకోమని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. అలాగే, జనసేన శ్రేణులు, నాయకులకు కూడా డ్వాక్రా మహిళలు అండగా ఉండాలని కోరారు. త్వరలోనే డ్వాక్రా మహిళల సమస్యలపై విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మన రాష్ట్రంలో ఏడు లక్షల ఇరవై వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, వారి శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటోందని, వీళ్లకు సంబంధం లేకుండా వీళ్ల పేర్ల మీద వందల కోట్ల రుణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. న్యాయం కోసం కలెక్టర్ రెవెన్యూ అధికారులను నిలదీస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని, ఇలాంటి అవకతవకలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.