gvl: నారా లోకేష్ శాఖలో కుంభకోణం.. కోర్టుకు వెళతాం: బీజేపీ ఎంపీ జీవీఎల్
- వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారు
- ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పాలి
- ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిర్వహిస్తున్న ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీ లేవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయనేదానికి 2014 నుంచి విడుదలైన జీవోలే కారణమని చెప్పారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయన్న వివరాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఐటీ శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళతామని చెప్పారు. ఐటీ శాఖలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అనేక సంస్థలను తీసుకొచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్లు దండుకున్నారని విమర్శించారు. నామమాత్రపు ధరకు భూములు ఇచ్చి... మూడేళ్ల తర్వాత కమర్షియల్ రేట్లకు అమ్ముకోవచ్చనే ఆఫర్ ఇచ్చారని తెలిపారు.