hari krishna: నాన్నా మా అందరిలోనూ నువ్వున్నావు: కల్యాణ్ రామ్ భావోద్వేగం
- నువ్వు మా గుండెల్లోనే ఉన్నావు
- విషాదం జరిగినపుడు 30 రోజుల షూటింగే ఉంది
- ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కు హాజరయ్యాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న నందమూరి కల్యాణ్ రామ్.. తన తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రొడ్యూసర్ బాగుండాలనే తపనతో తన తాతగారి నుంచి ఎలా షూటింగ్‌లకు హాజరైంది వెల్లడించారు.
‘‘నాన్న నువ్వు ఎక్కడికి వెళ్లలేదు. మా గుండెల్లో ఉండిపోయావు. ‘ప్రొడ్యూసర్ బాగుండాలి. వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి’ అని మాకు చెప్పావు. ఇప్పుడు మా అందరిలోనూ నువ్వు ఉన్నావు’’ అని కల్యాణ్‌రామ్ తన తండ్రి హరికృష్ణ గురించి భావోద్వేగంతో తెలిపారు. కల్యాణ్ రామ్ ప్రసంగిస్తున్నంత సేపు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర బాధకు గురైనట్టు కనిపించారు.
ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘‘నెల క్రితం ఒక సంఘటన జరిగింది. చాలామంది సినిమా విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తోంది. 1962వ సంవత్సరంలో మేకప్ వేసుకుని షూటింగ్ కు వెళ్లిన మా తాతగారు, మన అన్నగారు నందమూరి తారక రామారావుగారు షూటింగ్‌లో ఉండగా, ఒక అశుభ వార్త వినాల్సి వచ్చింది. ఆయన పెద్ద కొడుకు నందమూరి రామకృష్ణగారు కన్నుమూశారని తెలిసింది. కొడుకు చనిపోతే ఏ తండ్రీ తట్టుకోలేడు. కానీ, ఆయన లొకేషన్‌లో ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్‌కు నష్టం రాకూడదని, రోజంతా షూటింగ్ చేసి అప్పుడు వెళ్లారట. వృత్తిధర్మం అలాంటిది. 1976లో మా ముత్తాత కూడా రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు.
అప్పుడు కూడా మా తాతగారు వృత్తి పట్ల గౌరవంతో షూటింగ్ పూర్తి చేసే వెళ్లారు. 1982లో మా బాలయ్య బాబాయ్, రామకృష్ణ బాబాయ్‌ల పెళ్లిళ్లు వరుసగా జరిగాయి. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ప్రచారంలో ఉండి పెళ్లికి కూడా రాలేదు. ఎందుకంటే, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు కాబట్టి. దాన్ని వృత్తిగా అనుకున్నారు కనుకే రాలేదు. అలాగే, వాళ్ల అమ్మకు ఇచ్చిన మాటకు మా నాన్నగారు ఎన్టీఆర్ వెంటే ఉండి ప్రచార రథసారథిగా ఆయన బాగోగులు చూసుకున్నారు. ఇటీవల మా ఇంట్లో విషాదం జరిగినప్పుడు ‘అరవింద సమేత’ 30 రోజుల షూటింగ్ మిగిలే ఉంది. అసలు సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అవుతుందా? అనుకున్నారు. కానీ, ప్రొడ్యూసర్ బాగుండాలి. మనం ఇచ్చిన మాట మీద నిలబడాలని ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కు వెళ్లాడు. అలా చేయడం వల్లే ఇప్పుడు అందరం ఈ ఆడియో వేడుకకు రాగలిగాం’’ అని తెలిపారు.